Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే పోలీస్ శాఖపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు అనంతరం క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బందిని, బదిలీ చేసే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దృష్టిపెట్టారని, దీనిపై ఇప్పటికే డీజీపీకి పలు సూచనలు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
గత స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం పై విమర్శలు రాకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనితో ఎస్ఐలు, సీఐలు, డిఎస్పీల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖ పలు జిల్లాల్లో దీనిపై కసరత్తు మొదలుపెట్టిందని సమాచారం. కొత్త ఎస్పీలు కూడా దీనిపైన దృష్టి పెట్టారని, ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దీనికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయని పోలీస్ వర్గాలు అంటున్నాయి.
నరసరావుపేట పార్లమెంటుతో పాటుగా కొన్ని కీలక పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరు అత్యంత కీలకంగా కానుంది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో నామినేషన్ కూడా వేయనీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీలు, ఇప్పటికే జిల్లాలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో వైసీపీకి లేదా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులను బదిలీ చేసేందుకు, వారి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. అలాగే వివాదాస్పద అధికారులకు సంబంధించి నివేదికలు కూడా ఎస్పీలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి కడప, అనంతపురం, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా పోలీసులు దృష్టి సారించారు. అలాగే చిత్తూరు జిల్లాలోని.. రాజంపేట, చిత్తూరు పార్లమెంట్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది పోలీస్ శాఖ.