Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ప్రచారాలు చూస్తూనే ఉన్నాం. వైయస్ షర్మిల ఎప్పుడో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సరే, ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేదు. పలు కారణాలతో ఆమె రాజకీయంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కొన్ని కుటుంబ సమస్యలు కూడా వైఎస్ షర్మిలను ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో షర్మిల, ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగానే కనబడుతోంది.
అటు కాంగ్రెస్(Congress) అధిష్టానం కూడా ఆమెకు కాస్త స్వేచ్ఛ ఇచ్చింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కమిషన్ ముందుకు అడుగు వేయడంతో, దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల తన వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు, ఆమె తీవ్రంగా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అవసరమైతే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా సమాచారం. దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల తర్వాత ఈ బహిరంగ సభను, ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారట. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి ఏపీలో కాస్త వ్యక్తిగత ఇమేజ్ ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం.
షర్మిల తో పాటుగా మరి కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు కూడా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రస్తుతం బలహీనంగా ఉండటంతో, ఆ స్థానాన్ని తాము ఆక్రమించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ కు, కాస్త సానుకూల వాతావరణం కనబడుతోంది. దీనితో ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు షర్మిల తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది వైఎస్ఆర్(YSRCP) కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించే దిశగా షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. తన తండ్రితో సన్నిహితంగా ఉండే కొంతమంది నాయకులను ఇప్పటికే ఆమె కలిశారని, పార్టీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారం.