Gambhir: తెలుగోడికి గంభీర్ అన్యాయం చేసాడా..?
టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) విషయంలో ఇప్పుడు ఓ విషయం సంచలనంగా మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో.. జరిగిన సీరీస్ లో వైట్ వాష్ కావడం, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి పాలు కావడంలో గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత గంభీర్ రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. గంభీర్ విషయంలో బోర్డు పెద్దలు కూడా సీరియస్ గా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆయనపై వేటు వేసే అవకాశం ఉండవచ్చని క్రికెట్ వర్గాలు భావించాయి.
అయితే ఆయన విషయంలో ఐసీసీ(ICC) చైర్మన్ జై షా సానుకూలంగా ఉండటంతో వేటు వేయలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం సంచలనం అయింది. బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ లను వారి వారి బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో సంచలనం అయింది. దీని వెనుక గంభీర్ ఉన్నాడు అనేది క్రికెట్ వర్గాల మాట. తనను తాను కాపాడుకోవడానికి వారిద్దరిని పక్కన పెట్టించాడు అంటున్నారు క్రికెట్ జనాలు.
అభిషేక్ నాయర్.. బ్యాటింగ్ విషయంలో ఫెయిల్ అయిన మాట వాస్తవమే. కాని టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఫీల్డింగ్ మెరుగుపడింది. ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో మూడేళ్ళ పాటు.. దిలీప్ మెరుగ్గా ఫీల్డింగ్ ను తీర్చిదిద్దారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఫీల్డింగ్ పై ఏ విధమైన విమర్శలు రాలేదు. బ్యాటింగ్ కోచ్ పైనే ఆరోపణలు వచ్చాయి. కాని దిలీప్ ను తప్పించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఓ తెలుగు వాడికి అన్యాయం జరిగిందని, గంభీర్ తన స్వార్ధం కోసం సమర్ధ కోచ్ ను అవమానించారు అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.







