China: నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు : చైనా వార్నింగ్
టారిఫ్ (Tariff)ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికా (America)తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా (China) హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల(High tariffs) నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారు. ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.







