Bumrah: సర్జరీ కోసం న్యూజిలాండ్ కు బూమ్రా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) ఫిట్నెస్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ బౌలింగ్ కు దూరంగా ఉన్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ సమయంలో ఇబ్బంది పడటంతో వెంటనే స్కాన్ కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ గాయం తీవ్రమైనదే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో గాయం గురించి తాజాగా అభిమానులను టెన్షన్ పెట్టే అప్డేట్ వచ్చింది.
బుమ్రా.. న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ స్కౌటెన్ తో టచ్ లోకి వెళ్ళాడు. సర్జన్ బీసీసిఐ మెడికల్ టీం.. అతనితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు. సెలెక్టర్లకు ఈ మేరకు సమాచారం కూడా పంపించారు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో బుమ్రా పేరు ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అతనికి గాయం తగ్గితే మాత్రమే బూమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక భారత్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా బూమ్రాను ఎంపిక చేయాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా సిడ్నీ టెస్ట్ కు రోహిత్ శర్మ (Rohith Sharma) గైర్హాజరైన నేపథ్యంలో భారత టెస్టు కెప్టెన్సీపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ నుండి పూర్తిగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. పెర్త్ మరియు సిడ్నీ టెస్ట్ లలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా ఆకట్టుకున్నాడు. అయితే అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయవద్దని మాజీలు కోరుతున్నారు. జస్ప్రీత్ బుమ్రాను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కోరాడు. అతను వికెట్లు తీయడం, ఫిట్‌గా ఉండటంపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు. కెప్టెన్సీ అతనిపై అనవసరంగా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని హెచ్చరించాడు.






