KTR: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మరో ప్రతిష్టాత్మక సంస్థ ఆహ్వానం అందింది. లండన్ (London) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్‌ఎల్), యూకేలోని వార్విక్ టెక్నాలజీ పార్క్ (Warwick Technology Park) లో ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద , విలువైన కారు బ్రాండ్ అయిన మైక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. తమ నూతన కేంద్రం ద్వారా ఆటోమోటిక్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పీడీఎస్‌ఎల్ (PDSL) సంస్థ పేర్కొంది.
ఈ నెల 30వ తేదీన యూకేలోని వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లోని పరిశోదన కేంద్రాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీడీఎస్‌ఎల్ సంస్థ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. కేటీఆర్ చేతుల మీదుగా తమ కేంద్రం ప్రారంభం కానుండటం తమకు గర్వకారణమని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల అన్నారు. కాగా, పీడీఎస్‌ఎల్ సంస్థ ఆహ్వానించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతానని తెలిపారు.