Air Danshin: గాలిలో గృహాలు.. భూకంపాల వేళ జపాన్ సంస్థ సరికొత్త ప్రయోగాలు…
ఇటీవలి మయన్మార్, థాయ్ లాండ్ భూకంపాలు వేలాది మందిని సజీవ సమాధి చేశాయి. వందలాది అపార్ట్ మెంట్లు నేలమట్టమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. పోనీ వాటిని కట్టాలన్నా మళ్లీ కోట్ల రూపాయలు కావాలి. తీవ్రంగా దెబ్బతిన్న వారిని ఎలా రక్షించాలి.. ఇలాంటి వాటికి సమాధానంగా ఓ కొత్త టెక్నాలజీని జపాన్ (Japan) సంస్థలు రూపొందిస్తున్నాయి. భూకంప సమయంలో ఇళ్లు ఒక్కసారిగా గాల్లో తేలతాయి. క్వేక్స్(Quakes) తగ్గిన తర్వాత తిరిగి భూమిమీద నిటారుగా నిల్చుంటాయి.
ఇలాంటి వింతను సుసాధ్యం చేస్తున్నాయి జపనీస్ కంపెనీలు. భూకంపాల నుంచి ఇళ్లను రక్షించుకునేందుకు జపాన్ ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. ఎయిర్ డాన్షిన్ అనే కంపెనీ భూకంప కార్యకలాపాల సమయంలో నిర్మాణాలను నేల నుంచి ఎత్తడానికి కంప్రెస్ట్ ఎయిర్ టెక్నాలజీని ఉపయోగించే లెవిటేటింగ్ ఇళ్లను డెవలప్ చేసింది.
సాధారణంగా ఈ ఇల్లు గాలి తీసిన ఎయిర్బ్యాగ్పై ఉంటుంది. కానీ భూకంపం వస్తుందన్న ఇండికేషన్ వచ్చిన వెంటనే.. వ్యవస్థ త్వరగా ఎయిర్‌బ్యాగ్‌ను పెంచి, ఇంటిని పైకి లేపి, వణుకుతున్న భూమికి ప్రత్యక్షంగా గురికాకుండా చేస్తుంది. ప్రకంపనలు తగ్గిన తర్వాత, ఇల్లు మెల్లగా దాని అసలు స్థానానికి తిరిగి వస్తుంది.
ఈ అత్యాధునిక సాంకేతికత ఇప్పటికే దాని ప్రభావాన్ని ప్రదర్శించింది. 2021లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో ఈ వ్యవస్థతో కూడిన ఇళ్ళు దెబ్బతినకుండా ఉన్నాయి. అదనంగా, జపాన్ భూ కదలికలు, అగ్నిపర్వత కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి సీస్మోమీటర్లను ఉపయోగిస్తుంది. భూకంప సంసిద్ధత, ప్రతిస్పందనను పెంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గాలిలో బెలూన్స్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో..ఈ ఇండ్లు కూడా అలాగే ఎగురుతాయి. జపాన్ టెక్నాలజీకి నెటిజన్లు జై కొడుతున్నారు. ఇవి ఇళ్లనే ఎత్తుతున్నాయంటే..కార్లను కూడా ఎత్తుతాయి. భూకంపాలే కాదు వరదలు వచ్చినప్పుడు కూడా లిఫ్టింగ్ కూడా ఉపయోగపడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.







