Odela 2: ‘ఓదెల 2’ అధ్బుతమైన థియేటర్ ఎక్స్‌పీరియెన్స్

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్తలు : మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, హెబ్బా పటేల్,
శరత్ లోహితశ్వ, నాగ మహేశ్, శ్రీకాంత్ అయ్యాంగర్, పూజారెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్, ఎడిటింగ్: అవినాష్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
సమర్పణ, క్రియేటెడ్ బై : సంపత్ నంది, నిర్మాత: డీ మధు
దర్శకత్వం: అశోక్ తేజ
విడుదల తేది : 17.04.2025
సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో తమన్నా భాటియా(Tamanna Bhatia) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. అశోక్ తేజ (Ashok Teja)దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు (D.Madhu)నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్, తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇటు దెయ్యం, అటు దేవుడు రెండింటినీ ఒకే చిత్రంలో కవర్ చేస్తూ వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అమ్మోరు నుంచి అరుంధతి వరకూ ఈ కోవలో వచ్చిన ప్రతి సినిమా ఆడియన్స్‌కి బలంగానే కనెక్ట్ అయింది. ఇలాంటి సూత్రంతోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఓదెల 2’. ఇటివల సక్సెస్ఫుల్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్నతమన్నా భాటియా ఈ చిత్రంలో కొత్తగా కనిపించడంలో ఆకట్టుకుంద లేదా? మరో సారి సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా ‘ఓదెల 2’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
2022లో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పుడు ఓటీటీలో మాత్రమే విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా మంది ఆడియన్స్‌కి నచ్చింది. బ్లడ్ సీన్స్, మహిళలపై అఘాయిత్యాలు కాస్త ఎక్కువగా ఉన్నా ఈ చిత్రం అయితే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఓదెల 2 పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఓదెల ఫస్ట్ పార్ట్ చూసినవారికి ఎక్కడ ముగిసిందో గుర్తుండి ఉంటుంది. ఊరిలో పెళ్లయిన అమ్మాయిలని అనుభవించి చంపేసే కిరాతకుడైన తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)(Vasista Simha) తల నరికేసి దాన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తుంది రాధ (హెబ్బా పటేల్)(Hebba Patel)). అక్కడితో ఓదెల ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. ఇప్పుడు ఓదెల 2 కూడా అలాంటి సీన్‌తోనే మొదలవుతుంది.
ఇక కథా విషయనికొస్తే…ఓదెల గ్రామంలో అమ్మాయిలను శోభనం రోజు పైశాచికత్వంగా అనుభవించిన తిరుపతి భార్య చేతిలో దారుణ హత్యకు గురవుతాడు. అయితే గ్రామానికి నరకం చూపించిన తిరుపతికి మరణం తర్వాత కూడా శిక్ష విధించాలని గ్రామస్థులు తీర్మానిస్తారు. దీంతో పంతులు (శ్రీకాంత్ అయ్యంగార్)(Srikanth Ayyangar) ‘సమాధి శిక్ష’ అంటూ ఓ పద్ధతి చెబుతాడు. మనిషి చనిపోయాక అతని శరీరాన్ని కాల్చినా, పూడ్చినా మోక్షం వస్తుందని.. కానీ గొయ్యి తీసి నిలబెట్టి పూడ్చి.. ఓ నల్ల కోడి రక్తాన్ని దానిపై పోసి.. ఊరిలో వాళ్ల గోళ్లు ఓ మూటలో కట్టి ఆ గొయ్యిలో పూడ్చేయాలని పంతులు చెబుతాడు. ఇలా చేయడం వల్ల ఊరిలో వాళ్లు అనుభవించిన గోస వాడి ఆత్మ కూడా అనుభవిస్తుందని పంతులు చెబుతాడు. దీంతో ఆయన చెప్పినట్లే తిరుపతి ఆత్మకి సమాధి శిక్ష వేస్తారు. అయితే సమాధి నుంచి బయటకు వచ్చి మళ్లీ గ్రామానికి పీడగా మారుతాడు.
అదే ఊరి వాళ్ల కొంప ముంచుతుంది. సమాధి శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి ఊరిలో ఒక్కొక్కరికి పట్టి శోభనం అయిన అమ్మాయిల్ని అనుభవించి చంపేస్తుంటుంది. దీంతో మరోసారి ఓదెల గ్రామం ఉలిక్కిపడుతుంది. తిరుపతి పీడ వదిలిపోయిందనుకున్న గ్రామస్థులు మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్లిపోతారు. తమని ఎవరు ఈ సమస్య నుంచి కాపాడగలరంటూ తిరుపతిని చంపి జైల్లో ఉన్న రాధని అడుగుతారు. దీంతో ఊరిని ప్రస్తుతం కాపాడగలిగేది ఒక్క భైరవి (తమన్నా భాటియా) మాత్రమేనంటూ రాధ చెబుతుంది. ఆ క్రమంలో శివ నామస్మరణలో జీవితాన్ని కొనసాగిస్తున్న నాగసాధువు అలియాస్ భైరవి ఓదెల గ్రామానికి వస్తుంది. తిరుపతి శవానికి సమాధి శిక్ష ఎందుకు వేశారు? సమాధి నుంచి మళ్లీ ఎలా తిరుపతి ఆత్మ లేచింది? తిరుపతి ఆత్మ ఓదెల గ్రామంలో సృష్టించిన అల్లకల్లోలం ఏమిటి? తిరుపతి ఆత్మకు నాగసాధువు చేసిన కట్టడి ఏమిటి? తిరుపతి ఆత్మకు వేసిన బంధనం ఎందుకు విఫలమైంది? ఓదెల గ్రామ క్షేమం కోసం నాగసాధువు భైరవి ఎలాంటి త్యాగం చేయడానికి సిద్దపడింది? ఆత్మకు పరమాత్మకు జరిగిన సంఘర్షణలో న్యాయం ఎటువైపు నిలిచింది? ఓదెల గ్రామానికి పట్టిన పీడ ఎలా వదిలింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఓదెల 2 సినిమా కథ.
నటీనటుల హవభావాలు:
రెండేళ్ల క్రితం భోళా శంకర్ సినిమాతో తమన్నా తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. అప్పుడప్పడు ఐటమ్ గర్ల్ గా కనిపించినా ఇప్పుడు గ్యాప్ తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. నాగ సాధువు భైరవిగా తమన్నా నటన అయితే చాలా బాగుంది. ఆమె హావభావాలు అన్నీ సరిగ్గా సరిపోయాయి. నిరంతరం పంచాక్షరి జపిస్తూ.. ఊపిరినే పంచాక్షరిగా మార్చుకున్న నాగ సాధువుగా తమన్నా మరిపించింది. సెకండాఫ్‌లో సినిమా భారాన్ని తన భుజాలపై మోయడం ఈ సినిమాకు బ్యూటీగా నిలిచింది. మరోవైపు తమన్నాని ఢీ కొట్టే తిరుపతి పాత్రలో నటుడు వశిష్ట సింహ తన సత్తా చాటాడు. సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చాడు వశిష్ట. ఇక హెబ్బా పటేల్ పాత్రకి ఈ పార్ట్‌లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. సాయిబు పాత్రలో మురళీ శర్మ(Murali Sharma)కి రెండు మూడు సీన్లు గట్టిగానే పడ్డాయి. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ సహా మిగితా క్యారెక్టర్లలో నటించిన వారంతా ఫర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు:
అయితే సినిమాకి ప్రధానమైన బలం మాత్రం ‘కాంతారా’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్.(Ajanish Loknath) ఎప్పుడూ తనదైన డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఆడియన్స్‌కి సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంటాడు అజనీష్. ఈ చిత్రంలో కూడా తిరుపతి పాత్ర, భైరవి పాత్రలు వచ్చినప్పుడు ఇచ్చిన బీజీఎం అదిరింది. క్లైమాక్స్‌లో శివుడు వచ్చినప్పుడు ఇచ్చిన బీజీఎం అయితే గూస్‌బంప్స్ తెప్పించింది.ఇక సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్(Soundarajan) తన పనికి వంద శాతం న్యాయం చేశారు. ఓదెల గ్రామం నేటివిటి, వాతావరణం చక్కగా చూపించారు. గ్రామస్థుల మూడ్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకాస్త క్వాలిటీ వుంటే బాగుండేది. సంపత్ నంది రాసిన డైలాగులు కూడా కొన్ని సీన్లలో బాగానే పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఒకే అనిపిస్తాయి. నిర్మాత డీ మధు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వైజ్‌గా లావీష్ గా ఖర్చు చేశారు.
విశ్లేషణ:
దైవభక్తి, క్రైమ్, హారర్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ డ్రైవ్ ఓదెల 2. అయితే ఈ సినిమాపై అరుంధతి, అమ్మోరు సినిమాల ప్రభావం భారీగా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా వశిష్ట, మురళీశర్మ క్యారెక్టర్లు చూస్తే అరుంధతి 2 మాదిరిగా అనిపిస్తుంది. కంటెంట్ కాస్త వీక్‌గా ఉన్నప్పటికీ.. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో భైరవిని కాపాడటానికి నందీశ్వరుడు, శివుడు వచ్చే సీన్లు థియేటర్లలో కేకలు పెట్టించాయి. ముఖ్యంగా శివుడు సీన్ అయితే రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా ఫలితాన్ని కాపాడింది మాత్రం ఆ శివుడు సీన్‌యే. దైవభక్తి, దుష్టశక్తికి మధ్య సంఘర్షణ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఓదెల 2 కూడా తప్పకుండా నచ్చుతుంది. ఓవరాల్‌గా అయితే సినిమాని బాగానే హ్యాండిల్ చేశారు. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రమిది. థియేటర్ నుంచి బయటికొచ్చినప్పుడు ఆడియన్స్ అయితే ఏ మాత్రం నిరాశపడరు. ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.