Modi: అమెరికా ఆంక్షల వేళ మోడీ సర్కార్ పక్కా ప్లానింగ్.. ఫలించిందా భారత్ ను ఎవరూ అడ్డుకోలేరు బ్రదర్..!

అమెరికా అగ్రరాజ్యం ఎలా అయింది..? దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి మేధోవలసను ప్రోత్సహించింది. వచ్చిన నిపుణులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించింది. వారి ప్రయోగాలు, స్టార్టప్ లను ఎంకరేజ్ చేసింది. వచ్చిన ప్రొడక్ట్స్ కు మంచి మార్కెట్ జరిగేలా ఏర్పాట్లు చేసింది. దీంతో అమెరికా నుంచి అత్యున్నతస్థాయి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఆదరణ సైతం అంతేస్థాయిలో ఉంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఉత్పత్తులు, ఆయుధ సంపత్తికి విశేష ఆదరణ లభించింది. దీంతో ఆ దేశం కాస్తా అగ్రరాజ్యంగా అవతరించి, కొనసాగుతోంది కూడా.
ఇదే విషయాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు, ఆదేశ నిర్మాణం కోసం పాటుపడి వ్యక్తులు చెబుతూ వస్తున్నారు. కానీ.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు ఇవేమీ పట్టడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పరోక్షంగా మేధోవలసపై దాడి చేస్తున్నారు. అమెరికన్లు గ్రేట్ అంటూ అదే పల్లవి కొనసాగిస్తున్నారు.ఫలితంగా ఇప్పుడు ఆ దేశంలోని వలసవాద నిపుణులు .. సమస్యల్లో పడ్డారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. అమెరికా అగ్రాధిపత్యానికి ముప్పన్న ఆందోళనలున్నాయి. కానీ ట్రంప్.. దీన్ని పట్టించుకోవడం లేదు.
భారత్ నుంచి అమెరికా వెళ్లిన నిపుణులు.. ట్రంప్ టారిఫ్, ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అగ్రరాజ్యం సహా విదేశాల్లోని భారతీయ, భారత సంతతికి చెందిన విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశోధకులు (Indian-origin scientists), విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యాసంస్థల్లో పనిచేసేలా కొత్త స్కీమ్ (Modi Govt New Scheme)ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈదిశగా తొలి అడుగు పడితే మాత్రం అది చాలా పెద్దమార్పుకు దారి తీసినట్లే అని చెప్పవచ్చు.
దేశీయ పరిశోధన, సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిభావంతులైన పరిశోధకులు, విద్యా నిపుణులను వెనక్కి తీసుకొచ్చి వారికి గ్రాంట్‌లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. దేశానికి తిరిగొచ్చిన స్కాలర్లు ఇక్కడ లాబోరేటరీలు ఏర్పాటుచేసి, రీసెర్చ్ బృందాన్ని నియమించుకునేలా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం.. ఉన్నత విద్యాశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, బయోటెక్నాలజీ విభాగ నిపుణులతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) లోని 12-14 ప్రాధాన్య రంగాల్లోని నిపుణులకు ఈ స్కీమ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఐఐటీ డైరెక్టర్లతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.