YS Viveka Case: వివేకా కేసులో బీటెక్ రవి సంచలన వాంగ్మూలం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Case) హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి (BTech Ravi) సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి (Chaitanya Reddy) జైలులోనే దస్తగిరిని బెదిరించారని, ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని బీటెక్ రవి ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం కడప జైలును సందర్శించారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సాక్షిగా ఉన్న రవిని ఎస్పీ విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. పోలీసులు విచారణకు పిలవడంతో హాజరైన బీటెక్ రవి, కర్నూలు ఎస్పీకి తన వాంగ్మూలం ఇచ్చానని తెలిపారు. 2023 నవంబర్ 28న దస్తగిరి (Dasthagiri) ఉంటున్న బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లడం తాను స్పష్టంగా చూశానన్నారు. నా బ్యారక్ సరిగ్గా దానికి ఎదురుగానే ఉందని వెల్లడించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న వ్యక్తి బ్యారక్‌లోకి నిందితుడి కుమారుడిని ఎలా అనుమతిస్తారని ఆరోజే జైలు అధికారి ప్రకాశ్‌ను ప్రశ్నించానని, కానీ, అధికారులు నా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదని బీటెక్ రవి చెప్పారు. ఆరోజు ఏం జరిగిందనేది ఎస్పీకి కూలంకషంగా వివరించానన్నారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని బీటెక్ రవి అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి తర్వాత అప్రూవర్‌గా మారి, కేసులో కీలక విషయాలను వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన తన ప్రాణాలకు ముప్పు ఉందని పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆయనకు జైలులో బెదిరింపులు వచ్చాయని, ఈ బెదిరింపుల వెనుక శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగానే సాక్షిగా ఉన్న బీటెక్ రవి వాంగ్మూలాన్ని కర్నూలు ఎస్పీ నమోదు చేశారు. దస్తగిరి బెదిరింపుల కేసులో విచారణాధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
బీటెక్ రవి వాంగ్మూలంతో ఈ బెదిరింపుల కేసు మరింత బలం చేకూరినట్లయింది. వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో, అప్రూవర్‌ను బెదిరించిన అంశంపై బీటెక్ రవి ఇచ్చిన వాంగ్మూలం విచారణకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ పరిణామం దోహదపడవచ్చు.