Paul Ingrassia: భారతీయులను నమ్మకూడదు.. ఇంగ్రాసియా షాకింగ్ కామెంట్స్ వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ నామినీ పాల్ ఇంగ్రాసియా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తోటి రిపబ్లికన్లతో చాటింగ్ చేస్తున్నప్పుడు, ఇంగ్రాసియా (Paul Ingrassia) భారతీయులపై విషం కక్కినట్లు సమాచారం. భారతీయులను నమ్మకూడదని, వారిని ఎప్పటికీ మార్చలేమని ఇంగ్రాసియో అన్నారట. దేశంలోని ఉన్నత నాయకత్వ స్థానాల్లో కేవలం శ్వేత జాతీయులు మాత్రమే ఉండాలని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిని (Vivek Ramaswamy) ఉద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లజాతీయులపై కూడా ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు, కొన్నిసార్లు నల్లజాతీయులు, భారతీయుల విషయంలో తనకు నాజీ తరహా ఆలోచనలు వస్తాయని కూడా పేర్కొన్నారు. 2024 మేలో జార్జియాలో మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి మాత్రమే ట్రంప్ (Donald Trump) ప్రత్యేకంగా ప్రచార సిబ్బందిని నియమించారని ఇంగ్రాసియా (Paul Ingrassia) వ్యాఖ్యానించడం మరో వివాదాంశం. ఈ చాట్ సంభాషణలు లీక్ కావడంతో, పలువురు నాయకులు ఇంగ్రాసియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.