ప్రవాసుల నుంచి 9.20 లక్షల కోట్లు.. అగ్రస్థానంలో భారత్

వివిధ దేశాల్లో సిర్థపడిన భారతీయులు ( ప్రవాసులు) 2022లో మన దేశంలోని వారి కుటుంబాలకు, సన్నిహితులకు 9.2 లక్షల కోట్లు (111 బిలియన్ డాలర్లు)ను పంపించారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లినవారు తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక సంవత్సరంలోనే 100 బిలియన్ డాలర్లు ప్రవాస నిధులు అందుకున్న తొలిదేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెగ్రేషన్ తన నివేదికలో పేర్కొంది. ఇలా ప్రవాసులు నిధులు ఎక్కువగా పంపించిన దేశాల్లో భారత్, మెక్సికో, చైనా, ఫిలిప్పిన్స్, ఫ్రాన్స్ టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.
చైనా కొంతకాలం పాటు రెండో స్థానంలో నిలిచినప్పటికీ, 2021 నుంచి మెక్సికో రెండో స్థానంలోకి వచ్చింది. 2022లో మెక్సికోకు ప్రవాసుల నుంచి 61 బిలియన్ డాలర్లు, చైనాకు 51 బిలియన్ డాలర్లు పంపించారు. భారత్‌కు ప్రవాసులు 2010లో 53.48 బిలియన్ డాలర్లు, 2015లో 68.91 బిలియన్ డాలర్లు, 2020లో 83.15 బిలియన్ డాలర్లు పంపించారు. దీంతో భారత్ అప్పటి నుంచి అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాసియా ప్రాంతం నుంచే ఎక్కువ మంది ప్రజలు వృత్తి, వ్యాపారాల కోసం వలస పోతున్నారని నివేదిక పేర్కొంది.