Donald Trump : అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ధరలు పెంచేస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ఔషధ దిగుమతులపై 200 శాతం సుంకాలు విధించినట్టయితే అమెరికన్ మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని ఫార్మా పరిశ్రమ (Pharma industry) హెచ్చరించింది. అయితే ప్రస్తుతానికి అది హెచ్చరిక మాత్రమేనని, టారిఫ్ ల పెంపు ఆ స్థాయిలో ఉండకపోవచ్చునని పేర్కొంటూ అలాంటి నిర్ణయం గనుక తీసుకున్నట్టయితే తాము ధరలు పెంచుతామని, అది అమెరికన్ వినియోగదారులకు భారం కాక తప్పదని పరిశ్రమ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరన్నారు. సుంకాలు పెంచితే అమెరికాలో హెల్త్‌కేర్ సంబంధిత ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుందంటున్నారు.
చిన్న ఫార్మా కంపెనీలు అతి తక్కువ మార్జిన్‌తో అమెరికాకు ఔషధాలు సరఫరా చేస్తున్నాయని, వాటిపై మార్జిన్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై భారత్ 10 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా అమెరికా ఎలాంటి సుంకాలు విధించడంలేదు. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక మార్కెట్ అని, వాటి మొత్తం ఆదాయంలో 30-40 శాతం అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, ఫార్మా హెడ్ దీపక్ జోత్వానీ (Deepak Jotwani) అన్నారు. భారత ఫార్మా కంపెనీలు ప్రధానంగా జెనరిక్ ఔషధాలు (Generic medicines) అమెరికన్ మార్కెట్‌కు సరఫరా చేస్తాయని, ఆ విభాగంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు.