BYD: ఎలక్ట్రానిక్ వెహికిల్స్ అమ్మకాల్లో లీడర్ గా చైనా..? ఆటోమొబైల్ సంస్థ BYD దూకుడు..!
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) గ్లోబల్ మార్కెట్ ను గుప్పిట పట్టిన అమెరికా దిగ్గజం టెస్లాకు గట్టి షాక్. ఎందుకంటే ఏళ్ల తరబడి అగ్రస్థానంలో ఉన్న టెస్లాకు .. చైనా సంస్థ BYD గట్టి షాకిచ్చింది. టెస్లాను దాటేసి అగ్రస్థానంలో సగర్వంగా నిల్చుంది. ఈఏడాది తొలి తొమ్మిది నెలల గణాంకాలను పరిశీలిస్తే.. BYD దూకుడు అర్థమవుతోంది.
తాజాగా విడుదలైన వివరాల ప్రకారం, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు బీవైడీ సుమారు 16.1 లక్షల ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇదే సమయంలో టెస్లా అమ్మకాలు 12.2 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో తన ప్రత్యర్థి కంటే బీవైడీ దాదాపు 3,88,000 వాహనాల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ గణాంకాలతో ఈవీ మార్కెట్‌లో బీవైడీ తిరుగులేని శక్తిగా అవతరించింది.
గతేడాది వాహనాల ఉత్పత్తిలో బీవైడీ స్వల్పంగా టెస్లాను అధిగమించింది. ఆ ఏడాది బీవైడీ 17.77 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగా, టెస్లా కంటే ఇది 4,500 యూనిట్లు మాత్రమే ఎక్కువ. అయితే, అమ్మకాల విషయంలో మాత్రం టెస్లానే ఆధిక్యంలో నిలిచింది. 2024లో టెస్లా 17.9 లక్షల కార్లను అమ్మగా, బీవైడీ 17.6 లక్షల యూనిట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ 2025లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుత అమ్మకాల సరళిని బట్టి చూస్తే, ఈ ఏడాది బీవైడీ 20 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని సులువుగా దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, టెస్లా ఈ మార్కును చేరాలంటే గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి తన అమ్మకాలను 50 శాతానికి పైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది టెస్లాకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.







