Manhattan Study: అమెరికా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందా..? మాన్ హట్టన్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ఏం చెబుతోంది..?
అమెరికా హెచ్ 1బీ వీసాదారులను తగ్గించేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో.. దీనికి సంబంధించి మాన్ హట్టన్ ఇన్ స్టిట్యూట్ (Manhattan Study) తాజా నివేదిక కీలకాంశాలను వెలుగులోకి తెచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపించేది, వాహక చోదకులు ఎన్నారైలేనని ఈ నివేదిక తేల్చింది. అసలు అమెరికా అప్పులు తగ్గడానికి ఉపయోగపడుతున్నది కూడా వీరేనని నివేదిక కుండబద్దలు కొట్టింది. దీంతో ఇన్నాళ్లు హెచ్1బీ వీసాదారులు.. తమ ఉద్యోగాలు దోచేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నారంటూ వచ్చిన వాదనలు వీగిపోయినట్లైంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ వలసదారులే అతిపెద్ద బలమని, దేశ జీడీపీ వృద్ధికి, అప్పుల భారం తగ్గించడానికి వారే ఎక్కువగా దోహదపడుతున్నారని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ ‘మాన్‌హట్టన్ ఇన్‌స్టిట్యూట్’ తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం, సగటున ఒక భారతీయ వలసదారుడు 30 ఏళ్ల కాలంలో అమెరికా జాతీయ అప్పును 1.6 మిలియన్ డాలర్లకు పైగా తగ్గిస్తున్నాడు. ఇతర దేశాల వలసదారులతో పోలిస్తే జీడీపీ వృద్ధికి కూడా భారతీయులే అధికంగా సహకరిస్తున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా హోల్డర్లు… దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనకరంగా ఉన్నారని తెలిపింది. సగటున ఒక హెచ్-1బీ వీసా హోల్డర్ 30 ఏళ్లలో జీడీపీని 5 లక్షల డాలర్లు పెంచుతూ, ఏకంగా 2.3 మిలియన్ డాలర్ల అప్పును తగ్గిస్తున్నట్లు నివేదిక వివరించింది.
ఈ నివేదిక రచయిత, మాన్‌హట్టన్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో డేనియల్ మార్టినో, దక్షిణాసియా వలసదారులను, ప్రత్యేకించి భారతీయులను “అత్యంత ఆర్థిక సానుకూల సమూహం”గా అభివర్ణించారు. ఒకవేళ హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని రద్దు చేస్తే, వచ్చే 10 ఏళ్లలో అమెరికా అప్పు 185 బిలియన్ డాలర్లు పెరిగి, ఆర్థిక వ్యవస్థ 26 బిలియన్ డాలర్లు కుదించుకుపోతుందని ఆయన అంచనా వేశారు.
ఒకవైపు ప్రశంసలు.. మరోవైపు ఆంక్షలు
భారతీయ వలసదారుల ప్రాముఖ్యతను ఈ నివేదిక ప్రశంసిస్తున్న తరుణంలోనే ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఈ కొత్త నిబంధనలపై దాఖలైన వ్యాజ్యాలను కోర్టులో ఎదుర్కొంటామని వైట్‌హౌస్ గురువారం స్పష్టం చేసింది. “అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడమే. హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు పెరిగిపోయి, అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థను సంస్కరించేందుకు అధ్యక్షుడు కొత్త విధానాలు తెచ్చారు” అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు.







