Kavitha: అమరవీరులకు కవిత క్షమాపణలు..!
బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), తన రాజకీయ ప్రస్థానంపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆమె తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) తరపున పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జనంబాట పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు, మేధావుల దగ్గరకు వెళ్లి వాళ్ల అభిప్రాయాలు సేకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జనంబాట కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరవీరులకు, అమరవీరుల కుటుంబాలకు ఆమె క్షమాపణలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజా సేవ చేసినప్పటికీ, అమరవీరుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులయ్యారని అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ, కేవలం 580 కుటుంబాలకే 10 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు అందించగలిగామని తెలిపారు. మిగిలిన కుటుంబాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. తాను మంత్రి పదవిలో లేనందున అధికారికంగా సంతకం చేసే అవకాశం లేక, పరిహారం విషయంలో న్యాయం చేయలేకపోయానని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతర్గత వేదికలపై ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీ, అమరవీరుల కుటుంబాలకు డబ్బులు అందేవరకూ తాను తగినంత పోరాటం చేయలేకపోయానని కవిత అంగీకరించారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి రాజకీయ పదవులు దక్కినప్పటికీ, చాలా మంది ఉద్యమకారులకు జరగాల్సినంత న్యాయం జరగలేదన్నది వాస్తవమని కవిత స్పష్టం చేశారు.
ప్రతి అమరవీరుల కుటుంబానికీ రూ. కోటి చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని కవిత ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం సాక్షిగా, మొత్తం 1200 అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఈ ప్రభుత్వం నుంచే ఇప్పిస్తానని, ఒకవేళ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చైనా సరే ఇప్పిస్తానని కల్వకుంట్ల కవిత ప్రమాణం చేశారు. ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘జనం బాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు కవిత ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటానని, సామాజిక తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోంచి బతుకమ్మను తీసేశారని ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తిరిగి బతుకమ్మను పెట్టేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.







