YCP: పదవుల పంపిణీతో వైసీపీలో పునరుజ్జీవనం సాధ్యమా?
ఏపీ రాజకీయాలలో ఎప్పటినుంచో వైసీపీ (YCP) ప్రస్థానం చూస్తే ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. మొదట ఇది ప్రాంతీయ స్థాయి పార్టీగా ఆవిర్భవించి, క్రమంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తెలంగాణా (Telangana) రాష్ట్రంలో కూడా కొంత బలం ఉన్న వైసీపీ, ఇప్పుడు పూర్తిగా ఏపీ వరకే పరిమితం అయిపోయింది. 2014లో అక్కడ మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు సాధించిన తరువాత, ఆ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు ఆగిపోయాయి.
2011లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) స్థాపించిన ఈ పార్టీ, మొదట నుంచీ తెలుగుదేశం (TDP) కు ప్రత్యామ్నాయంగా నిలవడానికి ప్రయత్నించింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఓటమి ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ స్థాయి నుండి పార్లమెంట్ వరకు వైసీపీ ఆధిపత్యం చూపింది. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. భారీ శాతం ఓట్లు వచ్చినా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో పార్టీకి తీవ్ర షాక్ తగిలింది. అసెంబ్లీలో విపక్ష హోదా కూడా రాకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా చేసింది.
వైసీపీ రాజకీయ ప్రస్థానం లో పదిహేనేళ్లలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే గడిపిందని చెప్పొచ్చు. 2019 నుండి 2024 మధ్య ఐదు సంవత్సరాల అధికారాన్ని తప్ప, మిగిలిన కాలమంతా ప్రతిపక్ష జీవితం గడిపింది. జగన్ స్వయంగా “విపక్షం నాకు కొత్త కాదు” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే నిజం అవుతున్నాయి. కానీ ఈసారి ఓటమి తరువాత పార్టీ తీరులో కొంత మార్పు కనిపిస్తోంది. కొత్తగా పదవుల పంపిణీపై అధిక దృష్టి పెట్టారు. పార్టీలో ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం ఉంది, కానీ ఇటీవల పెద్ద ఎత్తున మార్పులు చేశారు. కొత్తగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (Political Advisory Committee), రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పరిశీలకులు, అనుబంధ విభాగాలకు నేతలను నియమించారు. మహిళ, యువత, రైతు, విద్యార్థి విభాగాలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ పెద్ద ఎత్తున కొత్త నాయకత్వాన్ని తెచ్చారు.
అయితే ఈ పదవులు అందిపుచ్చుకున్నవారు నిజంగా పార్టీకి ఎంత ఉపయోగపడుతున్నారు? కేవలం పదవులు పంచడం కాకుండా, వాటికి బాధ్యతలు, పనితీరు కూడా ఉండాలి. పార్టీ హైకమాండ్ వారికి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఇస్తుందా? వారు ప్రజల్లోకి వెళ్లి పని చేస్తున్నారా? అనే విషయాలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అదే.. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి నమ్మకం తిరిగి తెచ్చుకోవడం కష్టంగా మారింది.లేనిపక్షంలో, ఇన్ని కమిటీలున్నా ఫలితం రాకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం — వైసీపీ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి ఉంది, ఇది ఇతర పార్టీల్లో కనిపించని విషయం. కానీ పదవులలో ఉన్న నేతల పనితీరు మాత్రం పార్టీకి పనికి వచ్చేలాగా కనిపించడం లేదు. దీనిపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.







