Amaravathi: ఏపీ వైపు గల్ఫ్ తెలుగు వారి చూపు.. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని చంద్రబాబు పిలుపు..
ప్రపంచ చిత్రపటంపై ఏపీకి ప్రత్యేక స్థానం కల్పించాలన్నదే తన థ్యేయమంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu).. నూతన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి.. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడురోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబునాయుడు.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు సీఎం. త్వరలోనే కచ్చితమైన ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు.
వివిధ రంగాలపై యూఏఈ కంపెనీల ఆసక్తి
చంద్రబాబుతో భేటీ అయిన పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కల్పనలో తమకు ఆసక్తి ఉందని శోభా గ్రూప్ తెలిపింది. ఈ సందర్భంగా అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ఆ సంస్థ చైర్మన్ రవి మీనన్ రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో పాలుపంచుకుంటామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ తెలపగా, ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని షరాఫ్ గ్రూప్ హామీ ఇచ్చింది. వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు బుర్జిల్ హెల్త్ కేర్, ఏఐ డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీపై జీ42 సంస్థ ఆసక్తి చూపాయి.
తన మూడు రోజుల పర్యటనలో సుమారు 25 కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతం ప్రత్యేకతను, అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి విడమరిచి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని వివరించారు. రాయలసీమలో పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు అవకాశాలున్నాయని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం రంగాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని, అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, అవసరమైతే విధానాల్లో మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రవాస భారతీయులతో సమావేశాలు
పర్యటనలో భాగంగా యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్, ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్‌లతో సీఎం బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ బృందాన్ని పంపిస్తామని యూఏఈ మంత్రులు హామీ ఇచ్చారు. దుబాయ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పది గల్ఫ్ దేశాల నుంచి వేలాదిగా తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వచ్చే నెలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఆసక్తి చూపిన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.







