YS Jagan: ‘డేటా సెంటర్’ క్రెడిట్ ఫైట్.. వైసీపీది బరితెగింపు కాదా..?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ విచిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమం క్రెడిట్ కోసం పార్టీల మధ్య జరిగే పోరాటం వాస్తవాలను కప్పిపుచ్చే స్థాయికి చేరుతోంది. తాజాగా విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అనుసరిస్తున్న ప్రచార తీరు బరితెగింపుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ అధినేత వైఖరిని సమర్థిస్తూ, వాస్తవాలను పూర్తిగా విస్మరించి ప్రచారం చేస్తున్న వైసీపీ తీరు ప్రజల జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయడమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ తనకే దక్కాలని వైఎస్ జగన్ (YS Jagan) వాదిస్తున్నారు. తన హయాంలోనే అదానీ డేటా సెంటర్ (Adani Data Center) కు శంకుస్థాపన చేశామని, దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చిదని చెప్తున్నారు. ఈ క్రెడిట్ తనకు రాకుండా చంద్రబాబు (Chandrababu) కొట్టేయాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
అయితే, జగన్ ఇక్కడొక విషయాన్ని పూర్తిగా విస్మరించారు. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 15న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదానీ గ్రూప్‌తో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీల్‌ను ఖరారు చేసి, శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నేటికీ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అంటే, విశాఖ డేటా సెంటర్‌కు తొలి అడుగులు పడిందీ.. శంకుస్థాపన జరిగిందీ చంద్రబాబు హయాంలోనే.
తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ డీల్‌ను రద్దు చేసి, అదే అదానీ గ్రూప్‌తో మళ్లీ కొత్త డీల్‌ను సెట్ చేసుకుని శంకుస్థాపన చేసింది. ఇక్కడే జగన్ తన క్రెడిట్ కోల్పోతున్నానని భావిస్తున్నారు. కానీ, చంద్రబాబు హయాంలోనే డేటా సెంటర్ కు డీల్ కుదిరిందని, శంకుస్థాపన కూడా జరిగిందనే వాస్తవాన్ని జగన్ పూర్తిగా పక్కనపెట్టేశారు. కేవలం తమ హయాంలో జరిగిన శంకుస్థాపనను మాత్రమే పెద్ద పెద్ద బ్యానర్లు, ఆర్టికల్స్‌తో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా పదే పదే అబద్ధాలను, పాక్షిక వాస్తవాలను ప్రచారం చేస్తే కొంతకాలానికి అవే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆ పార్టీ ఉన్నట్టు అర్థమవుతోంది.
కానీ జనం అమాయకులు కారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 డీల్ గురించి, ఫోటోల గురించి ప్రజలకు తెలుసని, వాటిని విస్మరించి ప్రచారం చేసినంత మాత్రాన నిజం మారిపోదని అంటున్నారు. తమ అధినేత తానా అంటే తందానా అనే అలవాటుతోనే వైసీపీపీ నాయకులు ఈ గుడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.
“జనం ఏమనుకుంటారోననే భయం, కనీస ఆలోచన కూడా ఆ పార్టీ నేతల్లో కనిపించట్లేదు. అందుకే దీన్ని బరితెగింపుగానే భావించాలి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కూడా, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, వాస్తవాలను దాచిపెట్టే ధోరణి ఆ పార్టీకే మరింత నష్టం కలిగిస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలను విస్మరించి, కేవలం తమ క్రెడిట్ కోసమే ప్రచారం చేసుకునే ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ బరితెగింపు ప్రచారం ఆ పార్టీకి దీర్ఘకాలంలో ఏమాత్రం మేలు చేయదని స్పష్టమవుతోంది.







