Jaishankar: అమెరికా సెలెక్టివ్ విధానాలకు నిదర్శనం.. రష్యా చమురుపై ఆంక్షలను ఖండించిన జైశంకర్
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అనుసరిస్తున్న విధానాలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) తీవ్రంగా ఖండించారు. ఇంధన కొనుగోలు విషయంలో అమెరికా ‘ద్వంద్వ వైఖరిని’ అవలంబిస్తోందని ఆరోపించారు. ఆసియాన్ సదస్సు సందర్భంగా మాట్లాడిన జైశంకర్.. ప్రపంచ దేశాలకు నీతులు చెప్పేవారు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా ట్రంప్ (Donald Trump) సర్కారుకు చురకలు అంటించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు తమపై 25 శాతం సుంకం విధించడమే కాక, కొనుగోళ్లను ఆపాలని అమెరికా ఒత్తిడి చేస్తోందని ఆయన గుర్తుచేశారు. అయితే అదే రష్యా నుంచి చమురు తీసుకుంటున్న చైనా, ఇతర యూరోపియన్ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అమెరికా ‘సెలెక్టివ్’ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచం సప్లయ్ చైన్స్ బలహీనత, ఇంధన మార్కెట్లు తగ్గిపోవడం వంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని జైశంకర్ (Jaishankar) ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత, సహజ వనరుల కోసం పోటీ పెరుగుతున్న ఈ సమయంలో.. కొన్ని దేశాలకే నిబంధనలు వర్తింపజేయడం సరికాదన్నారు. అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోతో (Marco Rubio) భేటీ తర్వాత జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.







