మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల

భారత సంతతికి చెందిన తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‍గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త చైర్మన్‍గా కంపెనీ ఎంపిక చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సత్య నాదేళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి సత్య నాదెళ్ల సీఈవో బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్ లో కీలక మార్పులు చేటు చేసుకొన్నాయి. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పని చేసింది. దీంతో మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. అప్పటికే ఈ విభాగంలో ఆపిల్, గూగుల్ పనిచేస్తున్నాయి. 1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల బాధ్యతలు చేపట్టాక భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కాలం పాటు కంపెనీ పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్వేర్ ప్యాకేజీలను తయారు చేయడంపైనే దృష్టి పెట్టింది. కానీ, సత్య నాదెళ్ల మొబైల్ రంగం వైపు కూడా సంస్థను నడిపించారు.