మైక్రోసాఫ్ట్ మరో రికార్డు…
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేరు పరుగులు పెడుతోంది. అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో కంపెనీ షేరు ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్ కాపిటలైజేషన్ విలువ రెండు ట్రిలియణ్ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు)కు చేరింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. 2014లో సత్యా నాదేళ్ల బాద్యతలు చేపట్టే నాటికి కంపెనీ విలువ 310 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2019 నాటికి ట్రిలియన్ డాలర్లకు (రూ.75 లక్షల కోట్లు)కు చేర్చారు. ఆ తర్వాత రెండేళ్లలోనే మరో ట్రిలియన్ డాలర్ల సంపదను జోడించారు. గతేడాది 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ ఘనత కేవలం యాపిల్దే. ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ 2020 ఆగస్టులోనే ఈ రికార్డును నమోదు చేసుకుంది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 2.23 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది.






