Rajesh Agarwal : వాణిజ్య చర్చల కోసం మళ్లీ అమెరికాకు మన బృందం : రాజేశ్ అగర్వాల్

అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సంప్రదింపులకు భారత్ (India ) ప్రయత్నిస్తున్నదని కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ (Rajesh Agarwal ) తెలియజేశారు. ప్రతిపాదిత భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంప్రదింపుల కోసం ఈయనే చీఫ్ నెగోషియేటర్‌గా కూడా ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌కల్లా ఈ ఒప్పందంలో మొదటి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తు న్నట్టు చెప్పారు. అంతకన్నా ముందు ఓ మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాలని ఇరు దేశాలు చూస్తున్నాయన్నారు.
ఇప్పటిదాకా భారత్ 26 దేశాలతో 14కుపైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమల్లోకి తెచ్చినట్టు రాజేశ్ వివరించారు. బ్రిటన్ (Britain)తో ఒప్పందానికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయన్న ఆయన, ఈయూతో తుది దశకు వచ్చినట్టు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ లాజిస్టిక్స్‌పై జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. చిలీ, పెరు తదితర లాటిన్ అమెరికా దేశాలతోనూ వాణిజ్య ఒప్పందాల సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు. న్యూజీలాండ్ (New Zealand)తో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆస్ట్రేలియా, యూఏఈతో పూర్తయ్యాయని చెప్పారు. భారతీయ ఎగుమతి-దిగుమతులు 1,150 బిలియన్ డాలర్లను దాటిపోయాయని, కాబట్టి లాజిస్టిక్స్ ముఖ్యమని అన్నారు.