చైనాతో వివాదం లేదు.. పోటీ మాత్రమే : బైడెన్

చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు, సెమి కండక్టర్లు, సోలార్ ఎక్విప్‌మెంట్, మెడికల్ సప్లయ్‌లపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. ప్రధానంగా విద్యుత్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలను 100 శాతానికి పెంచాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చైనా భారీ స్థాయిలో విద్యుత్ వాహనాలను తయారు చేస్తోందని, ఇవి అమెరికాలోకి రావడం వల్ల స్థానికంగా ఉద్యోగాలపై ప్రభావం పడడంతో పాటు, జాతీయ భద్రతకు ప్రమాదం ఉందన్న కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని దీంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడిరచాయి.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా, దాని మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు తక్కువ ధరలోనే లభిస్తున్న చైనా విద్యుత్ వాహనాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఈ దేశాల్లో తయారు చేస్తున్న వాహనాల కంటే చైనా నుంచి ఎక్కువ విద్యుత్ వాహనాలు వస్తున్నాయని ప్రధానంగా అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగస్టు 2022లో సంతకం చేసిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం ప్రకారం వాతావరణ అనుకూల పెట్టుబడులకు చైనా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించడాన్ని సమర్థించుకుంటూ బైడెన్ చైనాతో వివాదం లేదని, పోటీ మాత్రమే ఉందని పేర్కొన్నారు. అమెరికా నిర్ణయం రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన విబేధాలకు దారితీయవచ్చని, దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.