Bill Gates: 100 ఏళ్లయినా ఏఐ ఈ పని చేయలేదు : బిల్‌గేట్స్

కృత్రిమ మేధ తో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. అయితే, వాటివల్ల కొత్త ఉపాధి అవకాశాలు లేకపోలేదనేది నిపుణుల మాట. ఈ అంశంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 100 ఏళ్లయినా ప్రోగ్రామర్లను ఏఐ (AI) భర్తీ చేయలేదని అన్నారు. ఇక కోడింగ్ (Coding) కు కూడా మానవ మేధ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ ప్రోగ్రామింగ్ (Programming) రంగంలో ఏఐ మనకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్ లాంటి బోరింగ్ అంశాల్లో సాయం చేస్తుంది. అంతేగానీ, పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారదు. ప్రోగ్రామింగ్‌లో అత్యంత సవాల్‌తో కూడుకున్నది ఏంటంటే, క్లిష్టమైన సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించడం. దాన్ని మెషిన్స్ చేయలేవు. ప్రోగ్రామింగ్‌కు జడ్జిమెంట్, ఊహాత్మక ఆలోచనా ధోరణి, పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు అవసరం. ఈ లక్షణాలు ఏఐలో లోపించాయి అని బిల్‌గేట్స్ అన్నారు.