US Visa Cancelations: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినా వీసా రద్దు.. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో కలకలం!
మిన్నెసోటా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇటీవల నిర్బంధించింది. ఈ ఘటన అమెరికాలో వీసా హోల్డర్లు ఇకపై ఎలాంటి కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే చర్చకు తెరలేపింది. మొదట ఈ అరెస్టును క్యాంపస్ నిరసనలకు సంబంధించిందని వార్తలు వచ్చాయి. అయితే అంతకుముందు మత్తులో డ్రైవింగ్ చేసిన కేసు కారణంగా ఆ విద్యార్థి ఎఫ్ -1 వీసా రద్దు (US Visa Cancelations) చేయబడిందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అందుకే ఆ విద్యార్థి అరెస్టు అయినట్లు వెల్లడించింది. అంటే భవిష్యత్తులో విదేశీ విద్యార్థులు ఏ చిన్న నేరం చేసినా కూడా వారి వీసాలు రద్దయ్యే ప్రమాదం ఉందని తేటతెల్లం అవుతోంది.
మద్యం మత్తులో డ్రైవింగ్ (DUI) చేయడాన్ని అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ఏమాత్రం సహించబోదని, దోషిగా తేలకపోయినా ఈ కేసులో అరెస్టయితే వీసా రద్దు (US Visa Cancelations) అవ్వొచ్చని ఈ సంఘటన వల్ల అర్థం అవుతోంది. ఈ విధానం విద్యార్థి వీసాలకే కాకుండా వర్క్ పర్మిట్లు లేదా గ్రీన్ కార్డు దారులను కూడా ప్రభావితం చేస్తుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) సమయంలో కూడా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే గ్రీన్ కార్డ్ దరఖాస్తులు కూడా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇలా యూనివర్సిటీ విద్యార్థిని అరెస్టు చేయడం విశ్వవిద్యాలయ అధికారులు, చట్టసభ సభ్యుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) విభాగం పనితీరులో పారదర్శకత లేకపోవడంపై మంకాటోలోని మిన్నెసోటా స్టేట్ యూనివర్శిటీ (Minnesota State University) అధ్యక్షుడు ఎడ్వర్డ్ ఇంచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెనేటర్ టీనా స్మిత్ కూడా ఇలా సరైన ప్రక్రియ లేకుండా విద్యార్థులను అరెస్టు చేయడం “తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం” అన్నారు. సదరు విద్యార్థి వివరాలు, ఏ దేశం వ్యక్తి అనేది కూడా తెలియని నేపథ్యంలో.. ఆ విద్యార్థి ప్రస్తుత పరిస్థితి ఏంటో తమకు తెలియజేయాలని మిన్నెసోటా యూనివర్సిటీ కోరింది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విద్యార్థులపై, ముఖ్యంగా పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు చేసిన వారిపై అమెరికా ప్రభుత్వం చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 300 మందికిపైగా విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. దీంతో రాజకీయ విధానాల వల్ల వీసాలు రద్దయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. అయితే ఇప్పుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన కారణంగా మిన్నెసోటా యూనివర్సిటీ విద్యార్థి వీసా రద్దవడంతో వారి ఆందోళన రెట్టంపవుతోంది. ఇలా ఎలాంటి ముందస్తు హెచ్చరిలు లేకుండా సడెన్గా వీసాలు రద్దు చేయడం, ఇమిగ్రేషన్ విభాగం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం.. అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులు, వారి మద్దతుదారులను ఆందోళనకు గురిచేసింది.






