President: భారతీయ కళా మహోత్సవం ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పశ్చిమ భారత రాష్ట్రాల సంస్కృతిని ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం భారతీయ కళా మహోత్సవం రూపంలో తెలంగాణ ప్రజలకు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) అన్నారు. రాష్ట్రపతి నిలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని (Secunderabad) రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 2వ భారతీయ కళా మహోత్సవాలను రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ముర్ము మాట్లాడుతూ మొదటి విడత భారతీయ కళా మహోత్సవంలో ఈశాన్య భారత సంస్కృతిని ప్రజలకు పరిచయం చేశామని, ఈసారి పశ్చిమ భారత వైభవాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందన్నారు. ఈ మహోత్సవం ద్వారా ప్రజలు ఆ ప్రాంతాల జానపద కళలు, హస్తకళలు, సంగీతం (Music), వంటకాల కోసం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహన పెంచుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా (Goa), దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్రాల సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యం, చేతివృత్తులు, వంటకాల వైభవాన్ని ప్రదర్శిస్తారు.






