America: ఎట్టకేలకు ఇరుదేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు. ఓవైపు పోరును ఆపడానికి శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న అమెరికా (America), ఉక్రెయిన్‌తో ఖనిజాల (Minerals) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ దేశంలోని అరుదైన ఖనిజ సంపదపై అగ్రరాజ్యానికి హక్కులు ఏర్పడనున్నాయి. ప్రపంచంలో 90 శాతం అరుదైన ఖనిజాలను చైనా (China) ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆ దేశంతో సుంకాల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందం అమెరికాకు భారీ స్థాయిలో లబ్ధి చేకూర్చనుంది. గత కొంతకాలంగా యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరు కూడా ఇక మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతి చర్చలకు రానున్న రోజుల్లో అమెరికా దూరమైనా ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్ గద్దెనెక్కినప్పటి నుంచి ఈ అరుదైన ఖనిజాలపై కీవ్‌తో అమెరికా చర్చలు జరుపుతూనే ఉంది. అగ్రరాజ్యం షరతులు ఏకపక్షంగా ఉన్నాయంటూ వాటిని ఉక్రెయిన్ (Ukraine) తిరస్కరిస్తూ వచ్చింది. అయితే తెరవెనక చర్చలు మాత్రం ఆగలేదు. ఇటీవల వాటికన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ట్రంప్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే ఈ ఒప్పందం కుదిరడం గమనార్హం.