అమెరికా అధ్యక్ష ఎన్నికలు-ఉత్కంఠకు తెరపడేడెప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ ఉత్కంఠను, అనిశ్చితిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. వన్డే క్రికెట్ మ్యాచ్‌లాగా చివరి బంతి వరకు విజయం ఎవరిదో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం విజయం డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్దేనని అనుకున్నా దానిని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనపిస్తోంది. కారణం… ఇంకా అత్యంత కీలకమైన ప్రభావ (స్వింగ్) రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండడమే! తాజా గణాంకాల ప్రకారం బైడెన్… మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకు అతి చేరువలో అంటే 264 ఓట్లను గెలుచుకుని శ్వేతసౌధం వాకిట జయభేరి మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అటు రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం 253-213 సంఖ్యను ఇస్తున్నాయి. కౌంటింగ్ సాగుతున్న వాటిలో ఒక చోట అంటే నెవడాలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా పత్రికల కథనాలు ప్రకారం బైడెన్‌కు మెజారిటీ ఉన్నట్లు వార్తలు వస్తున్నా, మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం విజయం తమదేనని చెబుతున్నారు.
ట్రంప్ మూడు రాష్ట్రాల్లో.. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఆయన విజయం సాధించాలంటే అన్నిటా గెలిచితీరాలి. అయితే గెలుపెవరిదన్నది ప్రకటించలేకపోవడానికి కారణం ఇద్దరి మధ్యా తేడా అతి స్పల్పంగా.. అంటే 1-2శాతం కంటే తక్కువగా ఉంది. లెక్కించాల్సినవి ఎక్కువగా పోస్ట ల్ బ్యాలెట్లేనని, ఇవి అధికంగా బైడెన్‌కే పడొచ్చని అంచనాలున్నా లెక్కింపు పూర్తయితే తప్ప ఎవరికెంత అన్నది చెప్పలేని పరిస్థితి! వివరంగా చెప్పాలంటే అరిజోనా, నెవడాల్లో ప్రస్తుతం బైడెన్‌కు ఆధిక్యం ఉంది. ఈ రెండింటా తన లీడ్‌ను చివరిదాకా నిలబెట్టుకుని గెలిస్తే ఆయనదే సింహాసనం. ట్రంప్‌కూ విజయావకాశాలున్నాయి. ఎలాగంటే పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అలాస్కాల్లో ఆయన ముందంజలో ఉన్నారు. ఈ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ బైడెన్ లీడ్‌లో ఉన్న రెండు రాష్ట్రాల్లో కనీసం ఒకదాన్నైనా దక్కించుకోవాలి. ఇది చేయలేకపోతే ఆయన 268 ఓట్లు మాత్రమే సాధించి మేజిక్ ఫిగర్ సమీపం వరకూ వచ్చి ఓడిపోయినట్లవుతుంది.






