Kiran Kumar Reddy: ఏపీ పాలిటిక్స్ లో కనిపించని కిరణ్ కుమార్ రెడ్డి..కారణం ఏమిటో?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) ఇప్పుడు రాజకీయ వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో సభ్యుడిగానే ఉన్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజంపేట (Rajampet ) పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి పరాజయం ఎదుర్కొన్న తర్వాత ఆయన పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోవడం గమనార్హం. ఒక దశలో ఆయనకు రాష్ట్ర నాయకత్వం లేదా రాజ్యసభ అవకాశాలు కలుగుతాయన్న ప్రచారం ఉన్నప్పటికీ, అవేవీ సాధ్యంకాలేదు.
చిత్తూరు ప్రాంతంలో ప్రభావవంతమైన కుటుంబాల్లో నల్లారి కుటుంబం ఒకటి. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి (Nallari Amarnath Reddy) కాంగ్రెస్ పార్టీలో (Congress) సుదీర్ఘకాలం పని చేసి మంచి గుర్తింపును సంపాదించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధిగా ఎదిగారు. 1994లో పరాజయం ఎదురైనా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి తన స్థానాన్ని బలపరచుకున్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌కు మంచి ప్రోత్సాహం లభించింది. మంత్రిత్వం దక్కకపోయినప్పటికీ చీఫ్ విప్ (Chief Whip) హోదా ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. 2009లో ఆయనను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించడం ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై నమ్మకాన్ని చూపింది. అనంతరం డాక్టర్ వైయస్ మరణం, రోశయ్య రాజీనామా తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ఆశ్చర్యకర నిర్ణయం అయినప్పటికీ, ఆయన ప్రశాంతంగా నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు.
అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆయన పాత్ర, నిర్ణయాలపై విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వేరే పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లినా ఘోర పరాజయం రావడంతో కొంతకాలం రాజకీయాలకు విరామమిచ్చారు. తరువాత మళ్లీ కాంగ్రెస్ వైపుకు తిరిగినా, ఎక్కువకాలం అక్కడ కొనసాగలేదు. చివరికి బీజేపీ లో చేరినా, అక్కడ కూడా కనిపించకుండా పోవడం ఇప్పుడు మరింత సందేహాలకు దారితీస్తోంది.
పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, కూటమి చర్చల్లో ఆయనకు పాత్ర లేకపోవడం, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు వినిపించకపోవడం..వంటి పరిణామాలు కిరణ్‌కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారా? అనే ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మళ్లీ రాజకీయ రంగంలో కనిపిస్తారా? లేక శాశ్వత విరామం తీసుకున్నారా? అన్నది కాలమే నిర్ణయించాలి.






