Karnataka: ట్వీట్ వదిలిన డీకే.. కాంగ్రెస్లో ముదురుతున్న సంక్షోభం!
కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics) మరోసారి వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హాయిగా ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ (Congress) పార్టీకి, ఇప్పుడు సొంత ఇంటి నుంచే సెగ తగులుతోంది. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఇప్పుడు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండున్నరేళ్ల పాలన తర్వాత అధికారాన్ని బదిలీ చేస్తామన్న ‘పెద్దల ఒప్పందం’ (Power Sharing Agreement) ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న పాములా మారింది.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని, చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఒప్పందంతో సిద్ధరామయ్యకు (Siddaramaiah) మొదట అవకాశం ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండటంతో, డీకే శివకుమార్ (DK Siva Kumar) తన వంతు కోసం పట్టుబడుతున్నారు. “కష్టపడి పార్టీని గెలిపించింది నేను, ఇచ్చిన మాట ప్రకారం పగ్గాలు నాకివ్వండి” అనేది డీకే వాదన.
ఇన్నాళ్లు తెరవెనుక మంతనాలు జరిపిన డీకే శివకుమార్, ఇప్పుడు బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా, ఎవరైనా సరే.. మాట నిలబెట్టుకోవాల్సిందే.” అని డీకే శివకుమార్ ట్వీట్ వేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సిద్ధరామయ్యను, పరోక్షంగా హైకమాండ్ ను ఉద్దేశించి చేసినవేనని స్పష్టమవుతోంది. మాట తప్పడం నాయకత్వ లక్షణం కాదని, ఒప్పందాన్ని గౌరవించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరిక ఈ ట్వీట్ లో దాగి ఉంది. ఇది కేవలం ట్వీట్ మాత్రమే కాదు, హైకమాండ్ పై డీకే ప్రయోగించిన రాజకీయ అస్త్రం.
మరోవైపు సిద్దరామయ్య మాత్రం కుర్చీ దిగడానికి ససేమిరా అంటున్నారు. ఆయన వాదన వేరుగా ఉంది. తాను ‘అహింసా’ (AHINDA) వర్గాల నాయకుడినని, తనను మార్చితే వెనుకబడిన వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఆయన పట్టుబడుతున్నారు. అంతేకాకుండా, ముడా (MUDA) కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో పదవి నుంచి తప్పుకుంటే, తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని కూడా ఆయన వర్గం వాదిస్తోంది.
ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విషయంలో గాంధీ కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రణదీప్ సూర్జేవాలా.. డీకే శివకుమార్ కు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో డీకే చేసిన సేవలు, ట్రబుల్ షూటర్ గా ఆయన పాత్ర, గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయనకు అవకాశం ఇవ్వాలని వీరు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతున్నారు. ఖర్గేకు సిద్ధరామయ్యతో ఉన్న సాన్నిహిత్యం, రాహుల్ కు సిద్ధరామయ్య మాస్ ఇమేజ్ పై ఉన్న నమ్మకం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఖర్గే వర్గీయులు కూడా సిద్ధరామయ్యనే కొనసాగించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. సిద్ధరామయ్యను తప్పిస్తే ఓబీసీ, దళిత ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. డీకేకు ఇవ్వకపోతే, బలమైన ఒక్కలిగ సామాజిక వర్గం పార్టీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డీకే శివకుమార్ ఒత్తిడికి తలొగ్గి మార్పు చేస్తే, సిద్ధరామయ్య వర్గం తిరుగుబాటు చేసే అవకాశం లేకపోలేదు. అది ప్రభుత్వం కుప్పకూలే వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. మాట నిలబెట్టుకోవడం అనే అంశాన్ని డీకే ప్రధాన అజెండాగా మార్చారు. ఇప్పుడు మాట తప్పితే, భవిష్యత్తులో పార్టీలో నమ్మకం సన్నగిల్లుతుందనే వాదన బలంగా ఉంది.
ప్రస్తుతానికి బంతి హైకమాండ్ కోర్టులో ఉంది. డీకే శివకుమార్ ట్వీట్ తో యుద్ధం మొదలైంది. ఆయన ఇక వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జరిగే చర్చలే కర్ణాటక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మాట నిలబెట్టుకుంటారా? లేక రాజకీయ అవసరాల కోసం మడమ తిప్పుతారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, కర్ణాటక కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నది మాత్రం సుస్పష్టం.






