White house: యూనివర్సిటీలపైనా ట్రంప్ యుద్ధం..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడాన్ని త్వరితంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ రకాల చర్యలు సైతం తీసుకుంటున్నారు. వాటిని ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిని నయానో భయానో దారికి తెచ్చేందుకు సైతం ప్రయత్నిస్తున్నారు. అది ప్రత్యర్థులైనా, పార్టీలైనా.. ఆఖరుకు యూనివర్సిటీలైనా సరే .. తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు.ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియా సహా కార్నెల్, నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయాలకు నిధులు స్తంభింప చేసిన ట్రంప్… తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ వర్సిటీపై పడ్డారు.
ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) తీరుపై ట్రంప్ కన్నెర్ర జేశారు. ఆ వర్సిటీకి అందించే ఫెడరల్ నిధులను స్తంభింపజేయాలని అమెరికా (USA) ప్రభుత్వం నిర్ణయించింది కూడా. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత వైఖరిని ఇలాగే కొనసాగిస్తే.. పన్ను మినహాయింపు హోదా కోల్పోవచ్చని ‘ట్రూత్ సోషల్’(truth social) వేదికగా స్పష్టం చేశారు. అదేవిధంగా యూనివర్సిటీని ఓ రాజకీయ సంస్థగా పరిగణించి పన్ను విధిస్తామని హెచ్చరించారు. ప్రజాప్రయోజనాలను ఉద్దేశించి పనిచేయడంపైనే పన్ను మినహాయింపు హోదా ఆధారపడి ఉంటుందన్నారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడి ఉద్దేశంతో.. హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్‌హౌస్ ఇటీవల పలు నిబంధనలు జారీ చేసింది. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌కు నిధులు స్తంభింపజేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లతో పాటు 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. పౌర హక్కులను ఉల్లంఘించారనే నెపంతో ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్ ప్రభుత్వం స్తంభింపజేసింది.