నైజీరియా అభ్యర్థి గెలుపు… అమెరికాకు షాక్
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్‌గా అమెరికా బలపరిచిన కొరియాకు చెందిన యో మెయింగ హీ ఓటమి చెందారు. నైజీరియాకు చెందిన డాక్టర్ నోజీ ఒకాంస్జోం ఐవీలా గెలుపొందారు. పోటీపడ్డ ఇద్దరూ మహిళలే. ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలు అమలుకు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ మూడు సాధనాలుగా ఉన్నాయి. ఇది ప్రారంభం నుంచి అమెరికా గుప్పెటల్లోని సంస్థ. అంతర్జాతీయ పైనాన్స్ పెట్టుబడికి లాభాలు సమకూర్చి ప్రపంచంపై తన అధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ మూడు సంస్థలను అమెరికా వాడుకుంటున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థ చరిత్రలో అమెరికా బలపరిచిన అభ్యర్థి ఓటమిపాలవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమిని అమెరికా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నది.
అక్టోబరు 28న జనరల్ కౌన్సిల్ సమావేశంలో 164 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలను జనరల్ కౌన్సిల్ చైర్మెన్ న్యూజీలాండ్‌కు చెందిన డేవిడ్ వాకర్ ఫలితాలను ప్రకటించారు. కాగా, దాని అమెరికా ప్రతినిధి డేవిస్ షియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకపక్క అమెరికా వ్యతిరేకిస్తుండగా, పారదర్శకత లేకుండా ఏ విధంగా ఈ నిర్ణయానికి వస్తారని గొడవ చేశారు. నవంబరు 9న జరిగే సమావేశంలో ఏమి జరుగుతుందో అనేది కూడా అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆధారపడి వుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.






