Donald Trump: సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదు

సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనా (China)కు ఎటువంటి రాయితీ లభించదని తేల్చేశారు. తన కఠినమైన వాణిజ్య విధానాన్ని ఆయన పునరుద్ఘాటించారు. మా నుంచి అసంబద్దమైన వాణిజ్య మిగులు, నాన్ మానిటరీ సుంకాల అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు. ఆ దేశం మాతో దారుణంగా వ్యవహరించింది. తప్పుడు వార్తలు రాసేవారికి ఇది తెలుసు. కానీ వారు దీనిని రిపోర్టు చేయరు. రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌లో సెమీ కండక్టర్లు (Semiconductors), మొత్తం ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలిస్తున్నాం. దీనిని బట్టి దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తేలింది. అప్పుడే మనం చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటాం. ఆ దేశం అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకుంటోంది. దానిని మేము కొనసాగనీయం. ఆ రోజులు ముగిశాయి. అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను, నియంత్రణల్లో భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి గతంలో ఇతర దేశాలు, ముఖ్యంగా చైనాలాంటివి మనతో ఎలా వ్యవహరించాయో. మనం అలాగే చేద్దాం. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (Make America Great Again) అని ట్రంప్ పేర్కొన్నారు.