బైడెన్ జోరు తగ్గలేదు…కానీ…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విజేత జో బైడెనేనని దాదాపుగా తేలిపోయింది. దేశ 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 538 ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో మేజిక్ ఫిగర్ 270కి చేరువగా గురువారమే వచ్చేసిన ఆయన మరో రెండు స్వింగ్ రాష్ట్రాలు- జార్జియా, పెన్సిల్వేనియాల్లో ముందంజలోకొచ్చేశారు. ఆధిక్యం స్వల్పమే అయినా లెక్కింపు సరళి ఆయనకే విజయాన్ని అందించేట్లుంది. ముఖ్యంగా 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాను గనక గెలిచేస్తే పీఠం ఆయనదే.
ప్రస్తుతం బైడెన్-ట్రంప్ 264-213 తేడాలో ఉన్నారు. లెక్కింపు పూర్తి కానందున కొన్ని చానెళ్లు ఇంకా బైడెన్‌కు 253 ఓట్లే ఉన్నట్లు చూపుతున్నాయి. ఒకవేళ పెన్సిల్వేనియా గెలిస్తే- బైడెన్ లీడ్ 270 సంఖ్యను దాటిపోతుంది. ఇవేకాక- జార్జియాలో కూడా ఆధిక్యంలోకొచ్చారు. అయితే ఆధిక్యత 1096 ఓట్లు మా త్రమే. ఇది సంప్రదాయకంగా రిపబ్లికన్ కంచుకోట. ఇది చేజారుతోందని గ్రహించిన రిపబ్లికన్లు అక్కడ రీకౌంట్ కోరారు. ఇద్దరి మధ్యా తేడా 0.5 శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంట్‌కు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అదీకాక- జార్జియా గవర్నర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. ఆయన రీకౌంటింగ్‌కు అనుమతించినట్లు ముఖ్య అధికారి బ్రాడ్ రాఫెన్స్పెర్జర్ ప్రకటించారు. మొత్తం మీద- 4 స్వింగ్ రాష్ట్రాల్లో బైడెన్ దూసుకెళుతున్నారు. నార్త్ కరోలినాలో మాత్రం ట్రంప్ ఆధిక్యం లో ఉన్నా ఇతర చోట్ల కూడా నెగ్గే పరిస్థితి ఉంటేనే గెలుపు దక్కుతుంది.






