జో బైడెన్ కు భద్రత పెంపు
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టు బైడెన్ భద్రతను కూడా పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బైడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ అధికారులను పంపించినట్లు తెలుస్తుంది. విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బైడెన్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని, దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్ సర్వీస్ ఏర్పాట్లు చేస్తోందని, ఈ ప్రణాళికలలో భాగమైన ఇద్దరు అధికారులు చెప్పినట్లు తెలిసింది. బైడెన్ తన ప్రసంగానికి విల్మింగ్టన్ సెంటర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన ప్రచార వర్గం సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం ఇచ్చిందని, ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.






