అమెరికా అధ్యక్షుడిగా బైడెన్: జనవరి 20న ప్రమాణం
అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరకు డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ విజయం సాధించి అధ్యక్షుడయ్యారు. ఎలక్టొరల్ కాలేజీలో లభించిన ఓట్లతో అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు. పెన్సిల్వేనియాలో విజయం సాధించడం ద్వారా బైడెన్ 284 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నెవాడాలోనూ డెమొక్రటిక్ పార్టీ విజయ ఢంకా మోగించింది. దాంతో, శనివారం తుది ఫలితాలు వెలువడే సమయానికి డెమొక్రటిక్ పార్టీ 290 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు అయింది. డొనాల్డ్ ట్రంప్ నేతత్వంలోని రిపబ్లికన్ పార్టీ మాత్రం 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైంది. దాంతో, బైడెన్ విజయం సాధించినట్లు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన బైడెన్ కూడా కొత్త అధ్యక్షుడిని తానేనని ప్రకటించుకున్నారు. బైడెన్ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.






