బైడెన్ భారత్ కు అనుకూలమా? పాక్ కు అనుకూలమా?
ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే మనదేశానికి ఇబ్బందులు తప్పవా అన్న సంశయం వ్యక్తమవుతోంది. పాక్‌కు ఆయన అనుకూలంగా ఉంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్థాన్‌తో ఆయనకున్న సాన్నిహిత్యమే దీనికి కారణం. ట్రంప్ హయాంలో గత నాలుగేళ్లలో పాక్ అనేక సమస్యలు ఎదుర్కొంది. ఉగ్రవాదం అణచివేత, భారత వ్యతిరేక కార్యకలాపాలు, అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా సైనికులపై దాడులను ఆక్షేపిస్తూ ట్రంప్ ముక్కుసూటితనంతో వ్యవహరిస్తూ వచ్చారు. ఆ దేశానికి ఆర్థిక సహకారం కూడా ఆపేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశం కూడా బైడెన్ విజయాన్ని కాంక్షిస్తోంది.
బైడెన్, సెనేటర్ రిచర్డ్ లుగర్ గతంలో పాక్‌కు సైనికేతర సాయం కింద 150 కోట్ల డాలర్లు ఇప్పించారు. దీంతో ఆ దేశం వీరిద్దరికీ 2008లో తన రెండో అత్యున్నత పురస్కారం ‘హిలాల్-ఎ-పాకిస్థాన్’ ఇచ్చి గౌరవించింది. పైగా బైడెన్ కశ్మీరీలకు బహిరంగ మద్దతు ప్రకటించారు. నిరుడు భారత ప్రభుత్వం 370 అధికరణను రద్దుచేసినప్పుడు.. కశ్మీరీల హక్కులను పరిరక్షించాలని.. అసమ్మతిపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షుడైతే భారత్‌కు ఇబ్బందులు తప్పవని.. పాక్‌తో సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని ఆ దేశ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






