Osama bin Laden: పాక్ సైన్యాధిపతికి, లాడెన్‌కు తేడా లేదు :అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ (Osama bin Laden)కు, పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ (Asim Munir) కు పెద్ద తేడా లేదని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ (Michael Rubin) పేర్కొన్నారు. బిన్‌లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే, ఇప్పుడు మునీర్ ప్యాలెస్‌లో జీవిస్తున్నాడు. ఇదొక్కటే వారి మధ్య వ్యత్యాసం అని అన్నారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) భారత పర్యటన సమయంలో కశ్మీర్‌లో ఇలాంటి దాడే జరిగింది. ఇప్పుడు అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తుండగా పహల్గాం (Pahalgam) లో ముష్కరులు నరమేధానికి పాల్పడ్డారు. ఈ దాడితో తమకు సంబంధం లేదని, స్థానికులే ఈ ఘోరానికి పాల్పడ్డారనని పాకిస్థాన్ నిందిస్తోంది. ఆ దేశ వక్రబుద్ధి అందరికీ తెలుసు. పహల్గాం దాడికి మనం ( అమెరికాను ఉద్దేశిస్తూ) చేయాల్సిందే ఒక్కటే. పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడమే అని మైఖెల్ రూబిన్ అన్నారు.