డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు నమోదవ్వగా, తాజాగా మరో కేసులోనూ ఎదురుదెబ్బ తగిలింది. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నానికి గాను ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ట్రంప్ పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ఆదేశించారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆయన న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది.






