Donald Trump : జిన్‌పింగ్ పోన్ చేశారన్న ట్రంప్ .. అలాంటిదేం లేదన్న చైనా!

చైనా సహా అనేక దేశాలపై ఇటీవల ప్రతీకార సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా ఆ దేశాధ్యక్షుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping) ఇటీవల తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రకటించారు. అయితే చైనా (China) ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఇటీవల కాలంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని తేల్చి చెప్పింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన స్నేహితుడని పలుమార్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఆయన నాకు ఫోన్ చేశారు. దానిని ఆయన బలహీనతగా నేను భావించడం లేదు. నేను ఆ విషయం గురించి స్పందించాలని అనుకోవడం లేదు కూడా, కానీ ఆయనతో చాలా సార్లు మాట్లాడాను అని తెలిపారు. కానీ చైనా అధ్యక్షుడితో ఎప్పుడు మాట్లాడారు, ఏ అంశంపై మాట్లాడారనే వివరాలను ట్రంప్ వెల్లడిరచలేదు. ఈ విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జియాకున్ (Jiakun) స్పందించారు. తనకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ఇరుదేశాల అధ్యక్షుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణలు జరగలేదని స్పష్టం చేశారు.