అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శ్వేతసౌధానికి రెండోసారి చేరుకోవాలన్న ట్రంప్ ఆశలకు ఈ తీర్పు బ్రేకులు వేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికాలో చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. కొలరాడో సుప్రీంకోర్టు 4-3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.






