Jagan – KTR: బెంగళూరులో జగన్, కేటీఆర్ భేటీ.. రాజకీయ ఊహాగానాల పోటీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఉండేది కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఈ నానుడిని నిజం చేస్తూ, ఇటీవల బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలుసుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు నేతలు ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే దానిపై అనేక ఊహాగానాలకు తెరలేపాయి.
గత ఐదేళ్లలో అటు తెలంగాణలో బీఆర్ఎస్ (BRS), ఇటు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల మధ్య బలమైన స్నేహ సంబంధాలు కొనసాగాయి. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. నాటి రాజకీయ అవసరాల రీత్యా.. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను అణచివేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించగా, ఏపీలో టీడీపీ, జనసేన కూటమిని దెబ్బకొట్టేందుకు వైసీపీ పావులు కదిపింది. ఈ క్రమంలో ఇరువురు నేతలు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకున్నారనేది విశ్లేషకుల మాట.
అయితే, కాలం మారింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ రెండూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన జగన్-కేటీఆర్ భేటీ.. కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదని, ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవడానికి రచిస్తున్న మాస్టర్ ప్లాన్ లో భాగమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ భేటీ తర్వాత ప్రధానంగా ఓ వాదన వినిపిస్తోంది. తెలంగాణలో వైసీపీని మళ్లీ యాక్టివేట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ లబ్ధి పొందేలా ప్రణాళికలు రచిస్తున్నారని భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న వైఎస్ అభిమానులు, సీమాంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి వైసీపీని రంగంలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా కొందరు భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే.. తెలంగాణలో వైసీపీని తిరిగి లేపడం అనేది ప్రస్తుతానికి కత్తిమీద సాము వంటిదే. తెలంగాణలో వైసీపీకి ప్రస్తుతం బలమైన క్యాడర్ గానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం గానీ లేదు. సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపేశారు. ఏపీలో ఘోర ఓటమి తర్వాత, అక్కడ పార్టీని తిరిగి గాడిలో పెట్టడమే జగన్‌కు అతిపెద్ద సవాలు. ఈ సమయంలో పక్క రాష్ట్రంపై దృష్టి సారించేంత తీరిక గానీ, ఆసక్తి గానీ ఆయనకు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ భావించింది. ఏపీలో కూడా పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన వరుస ఓటములతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. జాతీయ విస్తరణ కాంక్షను పక్కనపెట్టి, సొంత గడ్డపై పట్టు నిలుపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పరిమితమయ్యారు. కాబట్టి, ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశం లేకపోయినా, ‘మీ శత్రువు నా శత్రువు’ అనే సూత్రం ప్రకారం తెరవెనుక సహకారం మాత్రం కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ వైసీపీకి సపోర్ట్ చేయవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీ సానుభూతిపరుల మద్దతును బీఆర్ఎస్ కూడగట్టవచ్చు. వనరుల పరంగా, వ్యూహాల పరంగా పరస్పరం మార్పిడి చేసుకోవచ్చు.
బెంగళూరు భేటీతో వైసీపీ, బీఆర్ఎస్ మధ్య బంధం తెగిపోలేదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది. ప్రత్యక్షంగా తెలంగాణలో వైసీపీ పోటీ చేయకపోయినా, బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెట్టకపోయినా.. తమ ఉమ్మడి ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు మాత్రం రాబోయే రోజుల్లో వీరిద్దరూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త అధ్యాయం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.






