Canada: కెనడా కోర్టు సంచలన తీర్పు.. భారతీయ వృద్ధుడి బహిష్కరణ..!
కెనడాలోని ఒక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారంటూ 51 ఏళ్ల భారతీయ వ్యక్తి జగజీత్ సింగ్ (Jagjit Singh)ను ఆ దేశం నుంచి బహిష్కరించనున్నారు. నవజాత మనవడిని చూసేందుకు తాత్కాలిక వీసాపై జూలైలో కెనడాకు జగజీత్ వచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య సార్నియాలోని ఓ హైస్కూల్ స్మోకింగ్ ఏరియాలో టీనేజ్ అమ్మాయిలతో బలవంతంగా మాట్లాడటానికి, ఫోటోలు తీయడానికి జగజీత్ (Jagjit Singh) ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
బాలికలు నిరాకరించినా వినకుండా, వారి మధ్య బలవంతంగా కూర్చుని ఫోటో తీయమని జగజీత్ కోరినట్లు తెలుస్తోంది. ఒక ఫోటో తీసిన తర్వాత, అతను ఒక అమ్మాయిని అసౌకర్యానికి గురిచేసేలా ఆమె చుట్టూ చేయి వేయడంతో, ఆ అమ్మాయి అతన్ని తోసేసిందని వార్తా కథనాలు తెలిపాయి. ఈ ఘటనపై సెప్టెంబర్ 16న అరెస్ట్ అయిన జగజీత్ (Jagjit Singh) సింగ్‌పై లైంగిక జోక్యం, లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి.
అయితే కెనడా (Canada) కోర్టులో తనపై నమోదైన లైంగిక ఆరోపణలను జగజీత్ నిరాకరించారు. క్రిమినల్ వేధింపుల మాత్రం నేరం అంగీకరించారు. జగజీత్ (Jagjit Singh) చేసిన చర్యలు సహించరానివని న్యాయమూర్తి క్రిస్టా లిన్ లెస్జిన్కీ పేర్కొన్నారు. జగజీత్ వద్ద డిసెంబర్ 30న రిటర్న్ టికెట్ ఉన్నప్పటికీ, చట్టపరమైన సమస్యల కారణంగా అంతకు ముందే దేశం విడిచి వెళ్లాల్సి రావచ్చని తెలుస్తోంది. అతన్ని కెనడాలో మళ్లీ ప్రవేశించకుండా కూడా నిషేధించారు.






