Georgia : జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు

హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ ఫోబియా (Hinduphobia)ను అధికారికంగా గుర్తిస్తూ ఓ బిల్లును అమెరికాలోని జార్జియా స్టేట్ (Georgia State) ప్రవేశపెట్టింది. దీంతో హిందూఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా మారితే, జార్జియా పీనల్ కోడ్ (Georgia Penal Code ) ను సవరిస్తారు. అనంతరం దర్యాప్తు సంస్థలు హిందూఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు (Democrats), రిపబ్లికన్లు (Republicans) ఉన్నారు. కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందిస్తూ, ఈ బిల్లుకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.