అమెరికా అధ్యక్ష పీఠానికి చేరువలో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందు నుంచి ఊహించినట్లుగానే డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయంవైపు పయనిస్తున్నారు. ఇప్పటికే అందిన చివరి వార్తల ప్రకారం 264 స్థానాల్లో గెలిచినట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 270కి బైడెన్ దగ్గరైనట్లే. మరోవైపు ట్రంప్ కూడా తాను గెలిచినట్లు ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. ఓటింగ్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పడం కూడా కలకలం సృష్టించింది. అమెరికాలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈసారి 66.9 శాతం పోలింగ్ నమోదు కాగా.. కీలకమైన పలు రాష్ట్రాల్లో అభ్యర్థులిద్దరి మధ్య హోరాహోరీ పోరు కనిపించింది. డెమొక్రాట్లకు ముందు నుంచీ గట్టి పట్టున్న కాలిఫోర్నియాలో బైడెన్ విజయం సాధించారు. తద్వారా ఆయన ఖాతాలో 55 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు చేరాయి. 1992 నుంచీ అధ్యక్ష ఎన్నికల్లో కాలిఫోర్నియా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి వైపే మొగ్గుచూపుతోంది. న్యూయార్క్, ఇలినాయీ, న్యూజెర్సీ, మసాచుసెట్స్ వంటి పెద్ద రాష్ట్రాలూ బైడెన్ ఖాతాలోనే చేరాయి. రిపబ్లికన్లకు పట్టున్న ఆరిజోనా(11)లో ఈ దఫా బైడెన్ గెలుపొందడం విశేషం. మరోవైపు- 29 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ విజయ దుందుభి మోగించారు. టెక్సాస్ (38)లోనూ గెలుపొందారు. ఒహాయో, టెన్నెసీ, దక్షిణ కరోలినా, ఇండియానా తదితర రాష్ట్రాలూ ఆయన వశమయ్యాయి.
జో బైడెన్ గెలుచుకున్న రాష్ట్రాలివే
కాలిఫోర్నియా(55), న్యూయార్క్(29), ఇల్లినోయ్(20), మిచిగాన్(16), న్యూజెర్సీ(14), వర్జీనియా(13), వాషింగ్టన్(12), ఆరిజోనా(11), మాసాచుస్సెట్స్(11), మిన్నసోటా(10), మేరీలాండ్ (10), కొలరాడో(9), కనెక్టికట్(7), ఓరెగన్(7), న్యూమెక్సికో(5), న్యూహాంప్‌షైర్(4), రోడ్‌ఐలండ్(4), హవాయ్(4), విస్కాన్సిన్(4), మెయిన్(4), డీసీ(3), వెర్మాంట్(3), డెలవెర్(3), రాష్ట్రాలు డెమొక్రాట్ల ఖాతాలో పడ్డాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.
ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే:
టెక్సాస్(38), ఫ్లోరిడా (29), ఒహయో(18), టెన్నెసీ (11), ఇండియానా (11), మిస్సోరి(10), అలబామా(9), సౌత్కరొలైనా(9), కెంటకి(8), లూసియానా(8), ఓక్లహోమా(7), ఐయోవా(6), మిస్సిస్సిప్పీ(6), అర్కన్సాస్(6), కాన్సాస్(6), వెస్ట్ వర్జీనియా(5), నెబ్రాస్కా(5), ఇదాహో(4), వయోమింగ్(3), నార్త్ డకోటా(3), సౌత్ డకోటా(3), మోంటానా(3) రాష్ట్రాల్లో రిపబ్లికన్లు హవా కనబరిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.






