తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు …
అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లిన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పార్టీలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా అని అన్నారు. ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యర్థిత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ( డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమివ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్టు 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం.






