120 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కొన్ని వింతలు, విశేషాలు, సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కరోనా నేపథ్యంలో అత్యధికంగా బ్యాటెట్లు ఓట్లు నమోదు కావడం ఓ విశేషం కాగా, దేశ చరిత్రలోనే అత్యధిక ఓట్లు పొందిన అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ నేత జో బైడెన్ ఘనత సాధించారు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన ఎన్నికలు కూడా ఇవే కావడం మరో రికార్డు. 120 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి పోలింగ్ నమోదు కాలేదని అమెరికా ఎలక్షన్ ప్రాజెక్ట్ వెల్లడించింది. దాని ప్రాథమిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, తాజా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ 66.9 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ పక్రియ, లెక్కింపు కొనసాగుతున్నందున ఆ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్ట్ తెలిపింది. కాగా 120 ఏళ్ల తర్వాత అమెరికాలో అత్యధిక పోలింగ్ నమోదైన ఎన్నికలు ఇవే. చివరి సారిగా 1900లో అత్యధికంగా 73.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈ సంస్థ పేర్కొంది.






