INDvsAUS: పింక్ బాల్ టెస్టులో 10 వికెట్లతో చిత్తయిన భారత్.. హేలీకి ఘన వీడ్కోలు!
పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (INDvsAUS) మహిళల జట్ల మధ్య జరిగిన ఏకైక ‘పింక్ బాల్‘ (డే/నైట్) టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్ జట్టు సగర్వంగా గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా.. కనీస పోటీనివ్వలేక చతికిలబడిన భారత జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
మ్యాచు సాగిన తీరు..
ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా (INDvsAUS) తొలి ఇన్నింగ్స్లో కేవలం 198 పరుగులకే ఆలౌట్ కాగా, దానికి దీటుగా బదులిచ్చిన ఆసీస్ అమ్మాయిలు 323 పరుగుల భారీ స్కోరు చేసి స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఏ దశలోనూ కోలుకోలేక వికెట్లను సమర్పించుకుంది. ప్రతీకా రావల్ (63), స్నేహ్ రాణా (30) మాత్రమే కాసేపు ఒంటరి పోరాటం చేశారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 15 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడంతో భారత్ 149 పరుగులకే చాపచుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో లూసీ హామిల్టన్ 3 వికెట్లతో చెలరేగగా.. అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్, యాష్లే గార్డనర్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత (INDvsAUS) పతనాన్ని శాసించారు. డార్సీ బ్రౌన్కు ఒక వికెట్ దక్కింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హేలీకి అద్భుత వీడ్కోలు:
భారత్ (INDvsAUS) నిర్దేశించిన కేవలం 25 పరుగుల అత్యల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. వికెట్ నష్టపోకుండానే సునాయాసంగా టార్గెట్ చేరుకుంది. ఓపెనర్లు జార్జియా వోల్ (16 నాటౌట్), ఫోబ్ లిచ్ఫీల్డ్ (11 నాటౌట్) ఈ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ అలీసా హేలీ (Alyssa Healy)కి కెరీర్లో ఆఖరిది కావడం విశేషం. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆమెకు.. జట్టు అద్భుతమైన 10 వికెట్ల విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా హేలీ స్పందిస్తూ.. రాబోయే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడితే చూడాలని ఉందని తన ఆకాంక్షను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి






