US Federal : వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వు

అమెరికా ఫెడరల్ రిజర్వు (US Federal Reserve) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ కోత విధించింది. దీంతో యూఎస్‌లో ప్రస్తుతం వడ్డీరేట్లు 4- 4.25 శాతానికి చేరాయి. ఈ ఏడాదిలో వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. చివరిసారిగా గతేడాది డిసెంబర్ (December) లో ఫెడ్ వడ్డీ కోత విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్‌కు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఫెడ్ 0.25 శాతం వడ్డీ కోతను విధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మరో రెండు సార్లు పావు శాతం చొప్పున వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్ (Job market) అంత బలంగా లేదని దీంతో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (Jerome Powell) పేర్కొన్నారు. తాజగా తీసుకున్న వడ్డీరేట్ల కోత కారణంగా బహిరంగ మార్కెట్‌లో రుణాలు చౌకగా లభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఇది నియామకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.